Thu. Nov 14th, 2019

శ్రావణబెళగొళ లో బాహుబలి

Maha Mastakabhishekam, Shravanabelagola

Maha Mastakabhishekam, Shravanabelagola

bahubali-in-shravanabelagola

గోమఠేశ్వర స్వామిగా పిలవబడుతున్న బాహుబలి విగ్రహం శ్రావణబెళగొళ లో వుంది. ఇంద్రగిరి పర్వతంపై 59 అడుగుల ఎత్తుగల ఏకశిలా విగ్రహం కాయోత్సర్గ భంగిమలో నగ్నంగా నిలబడి వుంది. పశ్చిమ గంగ సామ్రాజ్యపు శిల్ప, వాస్తు కళా నైపుణ్యానికి ఇది ఆలవాలం. మగధ రాజు చంద్ర గుప్త మౌర్యుడు యుద్ధ జీవితంతో విసిగి శ్రావణబెళగొళ కి వచ్చి ధ్యానంతో మనశ్శాంతిని పొందినట్లు తెలుస్తున్నది. రాజస్థాన్లోని అబూ పర్వతం, ఒడిశాలోని ఉదయగిరి గుహలతో పాటు జైనులు శ్రావణబెళగొళను పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు. పట్టణానికి మధ్యలో ఒక కొలను ఉంది. దీనికి శ్వేతకొలను లేదా ధవళ సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు. శ్రవణుడి (గోమఠేశ్వరుడి) బెళగొళ కాబట్టి శ్రావణబెళగొళగా..పేరు స్థిరపడిoది. శ్రావణబెళగొళ కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రమైన హాసన్కు 51 కిలోమీటర్లు, బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రాస్థలాలైన హాళేబీడు నుండి 78 కిలోమీటర్లు, బేలూరు నుండి 89 కిలోమీటర్లు, మైసూరు నుండి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి 12 సంవత్సరాలకొకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండ తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు. చాముండరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి (ముసలవ్వ) గుల్లెకాయ (కొబ్బరికాయ) లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా ధవళ సరోవరమని పేరొచ్చిందని చెబుతారు. చాముండరాయ అవ్వ మహాత్యానికి అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

చరిత్ర: శ్రావణబెళగొళ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి చాముండరాయ నిర్మించాడు.

వింధ్యగిరిపై 59 అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం ఉంది. విగ్రహం పీఠంపై కన్నడ, ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది. ఈ శాసనం క్రీ.శ.981 నాటిది. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠేశ్వరుడిగా పిలిస్తే, జైనులు బాహుబలిగా కొలుస్తారు. ఈ గోమఠేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపూలు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారు. ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి వేలకొలది జైనులు తరిలివస్తారు. 2018లో మహామస్తకాభిషేకం జరిగింది.

బాహుబలి పుట్టుక: విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు.

బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో ‘బ్రాహ్మీ’ లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.ఒకరోజు రాజనర్తకి అయిన ‘నీరాంజన’ నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో ‘జీవితం క్షణభంగురం’ అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే ‘జినత్వం’ పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

గోమఠేశ్వర విగ్రహం: శ్రావణ బెళగొళ కి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది బాహుబలి విగ్రహమే. బాహుబలినే గోమఠేశ్వరుడు అని అంటారు. ఇంద్రగిరి పర్వతంపై 59 అడుగుల ఎత్తుగల ఈ ఏకశిలా విగ్రహం కాయోత్సర్గ భంగిమలో నగ్నంగా నిలబడి వుంది. 470 అడుగుల ఎత్తున్న ఇంద్రగిరి శిఖరం మీద 59 అడుగుల ఎత్తున, ఉత్తరదిక్కుకు అభిముఖంగా నిలచివున్న ఈ ఏకశిలా విగ్రహం సమస్త ఐహిక బంధాలను తెంచుకొన్న నిర్వికల్ప స్థితికి ప్రతీక.ఈ విగ్రహాన్ని గ్రానైట్రాతితో మలిచారు. ఏ ఆధారమూ లేకుండా నిటారుగా నిలబెట్టిన ఏకశిలా విగ్రహాలలో ప్రపంచంలో కల్లా పెద్దది. గోమఠేశ్వరుని బాహువులే 30 అడుగుల పొడుగుంటాయంటే… ఈ విగ్రహం విరాట్స్వరూపాన్ని ఊహించుకోవచ్చు.9 అడుగుల కైవారం కలిగిన పూర్ణవికసిత కమలపీఠం మీద ప్రతిష్ఠితుడైన బాహుబలి ఆజానుబాహుడు- అర్థనిమీలిత నేత్రుడై, ధ్యాన నిమగ్నుడైన ‘గోమఠేశ్వరుడి’ వదనారవిందంలోని దరహాసం భక్తుల్ని పరవశుల్ని చేస్తుంది, అలౌకికానందంలో ముంచివేస్తుంది. ఉంగరాలు తిరిగిన జుట్టు, విశాలమైన ఫాలభాగం, అర్థనిమీలిత నేత్రాలు, కోటేరు వేసినట్లున్న ముక్కు, దళసరి పెదవులు, మొనదేలిన చుబుకం, పొడవైన చెవులు, పటిష్ఠమైన కంఠం, విశాలమైన భుజాలు, ఆజానుబాహువులు, ఉన్నతమైన వక్షస్థలం, సన్నని నడుము, బలిష్టమైన ఊరువులు, కాళ్లు… ‘ఇంతకంటే సుందర స్వరూపుడు సృష్టిలోనే మరొకరు ఉన్నారా?’ అనిపిస్తుంది- ఈ మూర్తిని దర్శించినవారికి. ఐహిక బంధాలను త్యజించిన ఏకాగ్రతా దీక్షను ఆయన నగ్నత సూచిస్తుంది. కాళ్లకు, చేతులకు అల్లుకున్న మాధవీలతలు, చుట్టూ పెరుగుతున్న గుల్మవల్మీకాలు తపోదీక్షలో లీనమై… ఏ ఐహిక బాధలకూ చలించని ఏకాగ్రతకూ, దృఢసంకల్పానికీ సంకేతాలుగా శోభిస్తుంటాయి. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు.ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అలుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు.విగ్రహం కాలి గోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. ఒక సాధారణ మనిషి విగ్రహం దగ్గర నిలబడితే బాహుబలి పాదం ఎత్తుకు సరిపోతారు.తెల్లని రాతితో నిర్మించబడిన ‘బాహుబలి’ శిల్పసౌందర్యం గంగరాజుల కాలపు శిల్పకళా వైభవానికీ, నైపుణ్యానికీ చిహ్నంగా వుంది. చారిత్రక కథనం ప్రకారం 2వ మారసింహునికీ, 4వ రాచమల్లునికీ మంత్రిగా ఉన్న చాముండరాయడు ఈ బాహుబలి విగ్రహాన్ని తయారుచేయించాడు.

రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే “బెళగొళ” కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు.శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను శ్రమణ బెళగొళ అనేవారు.క్రమంగా శ్రావణ బెళగొళగా మారింది. స్థానికులు బెళగొళ అనే పిలుస్తారు.చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశంలో ఉన్న ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు. శాసనాలు: శ్రావణబెళగొళలో క్రీ.శ.600 నుండి 1830 మధ్య వివిధ కాలాలకు చెందిన దాదాపు 800 శాసనాలు లభించాయి. ఈ శాసనాలు చంద్రగిరి, ఇంద్రగిరి పర్వతాలపై మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి . వీటిలో ఎక్కువ భాగం చంద్రగిరి పర్వతం మీద లభించగా, ఇవన్నీ కూడా క్రీ.శ. 10 వ శతాబ్దికి ముందువే కావడం విశేషం. ఈ శాసనాలు కన్నడ, కొంకణి, మరాఠి, తమిళ, సంస్కృతభాషల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రాచీన కన్నడలో ఉన్నాయి. వీటిలో చాలా శాసనాలు పశ్చిమ గంగ, రాష్ట్ర కూట, హొయసల, విజయనగర, ఒడయార్ సామ్రాజ్యాల ఉత్థానపతనాలను సూచిస్తాయి. శ్రావణ బెళగోళలో గోమఠేశ విగ్రహం పాదాల దగ్గర ఉన్న శాసనాలు ఆ విగ్రహాన్ని, చుట్టు ఉన్న కట్టడాలను ఎవరు నిర్మించారో తెలియచేస్తున్నాయి. ఒక శాసనంలో కల్కియుగం అంటే 600 చైత్రమాసం సూర్యపక్షం ఐదవ రోజు ఆదివారం కుంభలగంలో చాముండరాయడు గోమఠేశుని విగ్రహాన్ని బెళ్గుళ నగరంలో ప్రతిష్ఠించినట్లు ఉంది. అయితే శాసనంలో పేర్కొన్న తేదీ, సంవత్సర నిర్ణయంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. అందుకే కొందరు క్రీ.శ.981 లో ప్రతిష్ఠించారంటే, మరికొందరు 983లో అంటున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొన్నప్పుడు ఈ విగ్రహం క్రీస్తుశకం 980-984 మధ్య ప్రతిష్ఠించబడిందని చెప్పవచ్చు. మరో శాసనంలో విగ్రహం చుట్టు ఉన్న కట్టడాలను గంగరాజు నిర్మించినట్లు ఉంది. కన్నడ భాష, సాహిత్యాల స్వభావం, పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఆధునిక పరిశోధకులకు ఈ శాసనాలు గొప్ప సంపద.

ఊరిపేరు: ‘శ్రావణ బెళగొళ’కు ఆ పేరు రావటానికి వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ‘బెళ్’ అనే కన్నడ పదానికి ‘తెల్ల తామరలు’ అని అర్థం. ‘గొళ’ అంటే కొలను. ‘తెల్లని తామరపువ్వులతో నిండిన కొలను’ ఆ ఊళ్లో ఉంది కాబట్టి దానిని ‘బెళగొళ’ అన్నారు. జైన భక్తులైన ‘శ్రవణులు’ ఊళ్లో ఎక్కువగా ఉండటంవల్ల ‘శ్రవణ’ అనే పదాన్ని ముందు చేర్చుకుని ఈ ఊరు ‘శ్రావణ బెళగొళ’ అయ్యింది అంటారు. తెల్లతామరలతో నిండిన పుష్కరిణే కాక- ‘ఇంద్రగిరి, చంద్రగిరి’ అనే రెండు అందమైన కొండలు కూడా ఊళ్లో ఉన్నాయి. ఇంద్రగిరినే ‘పెద్దమల’ అనీ, చంద్రగిరిని ‘చిన్నమల’ అనికూడా అంటారు.

చంద్రగిరి: శ్రావణ బెళగొళకు వాయువ్య దిక్కున ఉన్న చంద్రగిరి కొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీదకు 240 మెట్లెక్కి వెళ్లాలి. అశోక చక్రవర్తి తాతగారైన ‘చంద్రగుప్త మౌర్యుడు’ తన గురువు అయిన ‘భద్రబాహు ముని’తోనూ, ఇతర శిష్యగణంతోనూ ఈ చంద్రగిరికి వచ్చి ‘ప్రాయోపవేశ వ్రతదీక్ష’ (కోరికల్నీ, ఆశయాల్నీ, బాధ్యతల్నీ త్యజించిన సర్వసంగపరిత్యాగులు ‘నిరంతర ఉపవాసం’తో ప్రాణాల్ని త్యజించటం) పూని, సజీవ సమాధి చెందినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. భద్రబాహు ముని నిర్యాణం తర్వాత జైన శ్రవణులను విశేషంగా ఆకర్షించింది ఈ ప్రదేశమే. ఈ కొండపై ‘ప్రాయోపవేశం’ చేసి అనేకమంది శ్రవణులు సమాధి చెందినందువల్ల ఈ కొండను ‘సమాధి మల’ అనికూడా పిలుస్తారు. జైనాలయాలను ‘బసదులు’ అంటారు. చంద్రగిరిపై ‘శాంతినాథ, పార్శ్వనాథ, చాముండరాయ, కౌంతీశ్వర బసదులు’ ఉన్నాయి. అన్నిటిలోకీ ప్రాచీనమైనది ‘చంద్రగుప్త బసది.’ భరత విగ్రహం, మహానవమి మంటపం కూడా చూడదగ్గవే. ‘ఏకాంకణ సహజగుహ’ అయిన ‘భద్రబాహు గుహ’ కూడా ఇక్కడున్న ఒక ప్రత్యేక ఆకర్షణ. పెద్దమల లేక ‘పెర్కళ్ళప్పు’ అనికూడా పిలిచే ఇంద్రగిరి పర్వతం శ్రావణ బెళగొళకు జీవనాడి వంటిది అని చెప్పవచ్చు. 470 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీద 8 జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ‘అమ్మదేవ, చిన్నణ్ణ, భరతబాహు, సిద్ధర బసదులు’ ముఖ్యమైనవి. కొండపై ‘గొమ్మఠేశ్వరాలయం’ కూడా ఉంది. నాలుగు మంటపాలు, ఐదు మహాద్వారాలు, మూడు స్తంభాలతో అనేక ప్రాచీన శిల్పాలతో, శిలాశాసనాలతో విలసిల్లుతున్న ఇంద్రగిరి ఎంతో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించు కొన్నది. సంస్కృతమే కాక, కన్నడ, తమిళ, మరాఠీ భాషలలో చెక్కిన అనేక శాసనాలు చంద్రగిరి కొండపై ఉన్నాయి. ‘గుళ్ళకాయి అజ్జి’గా పేరొందిన ‘బిందెవ్వ’ విగ్రహం, త్యాగస్తంభం యాత్రికులు తప్పకుండా చూడవలసినవి. ఇవన్నీ ఒక ఎత్తయితే- సౌందర్యం మూర్తీభవించిన ‘బాహుబలి విగ్రహం’ ఒక్కటీ ఒక ఎత్తు. ఇంద్రగిరి శిఖరాన నిర్మితమైన బాహుబలి కారణంగానే శ్రావణ బెళగొళ ప్రముఖ యాత్రాస్థలంగా రూపుదిద్దు కొన్నది.
-మైనా స్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *