ఉత్త‌రాంధ్ర జాన‌ప‌దం.. తూర్పు భాగ‌వ‌తం

Thoorpu Sathyabhama -Mrs.Anjali

Thoorpu Sathyabhama -Mrs.Anjali

జానపద కళలు జనం పనిపాటల నుంచి పుట్టినవే. శ్రమజీవులను ఆటపాటలతో సేదదీర్చి వారికి వినోదాన్ని అందించే ఉత్ప్రేరకాలు. గ్రామీణ ప్రజల విశ్వాసాల చుట్టూ అల్లుకున్న కథలే కళారూపాలుగా మారాయి. తెలుగునాట ప్రసిద్ధి పొందిన జానపద కళారూపాల్లో వీధి భాగవతం ఒకటి. ఇదే ఉత్తరాంధ్రకు వచ్చేసరికి తూర్పు భాగవతంగా మారిపోయింది.
All artists
All artists

కూచిపూడి భాగవతం ఒకప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది. దీని నుంచి రూపొందిన వీధి భాగవతం ఒక సామాజిక కళారూపంగా రూపుదిద్దు కొన్నది. ఆయా ప్రాంతాల్లోని అన్ని కులాల్లోని ఔత్సాహిక కళాకారులు ఇందులో భాగమయ్యారు. సామాన్య ప్రజా నీకాన్నే కాక, పండితులు, విద్వాంసులు, కవులు, గాయకులను ఆకర్షించింది. ఈ కళారూపం ఇది ఒక విశిష్ట నర్తన రీతిగా, సంగీత సాంప్ర దాయంగా, మృదంగ బాణీగా సంస్థానాధీశుల ఆదరణకు నోచు కొన్నది. ఆయా ప్రాంతాల్లో తిరునాళ్ళలోను, అమ్మవారి జాతర్లలో ఈ భాగవతాలు ప్రదర్శనలు జరిపి కళాకారులు ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శతాబ్దాల తరబడి ప్రజలను అలరించిన ఈ జానపద కళారూపం నేడు అంతరించే దశలో ఉంది. అక్కడక్కడ మిగిలి ఉన్న విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి. డాక్యు మెంటరీలు తీయాలి. వేష-భూషణ అలంకారాలను భద్రపరచాల్సిన అవసరం ఉంది. కోమటిపల్లికి చెందిన తూర్పు భాగవతార్‌బొంతలకోటి సాంబమూర్తి ఇప్పటికి ఈ కళారూపాన్ని పదివేలసార్లకు పైగా ప్రదర్శించారు. ఆయన తూర్పు భాగవతంలో సత్యభామగా, గొల్లభామగా గుర్తింపు పొందారు. ‘తూర్పు భాగవతం’ కళ- కళాకారులపై ప్రత్యేక కథనం.

Thoorpu-sathyabhamaMrs-Anjali
Thoorpu Sathyabhama -Mrs.Anjali

చాలామంది పండితులకు ఎక్కువగా తెలిసింది కూచిపూడి వీధి భాగవతాలే. తూర్పు భాగవతానికి చారిత్రక ప్రాధాన్యo ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు, ఒడిశాలోని గంజాం, కోరాపుట్‌తదితర జిల్లాల్లో తూర్పు భాగవతం ఉనికిలో ఉంది. ఇది సామాన్య ప్రజా నీకాన్నే కాక, పండితులు, విద్వాంసులు, కవులు, గాయకులను ఆకర్షించింది. ఈ కళారూపం ఒక విశిష్ట నర్తన రీతిగా, సoప్రదాయ సంగీతoగా, మృదంగ బాణీగా సంస్థానాధీశుల ఆదరణకు నోచుకొన్నది. ఆయా ప్రాంతాల్లో తిరునాళ్ళలోను, అమ్మవారి జాతర్లలో ప్రదర్శనలు జరిపి, కళాకారులు ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. విజయనగర సంస్థానాధిపతి ఆనంద గజపతి రాజు,హరికథా పితామ హుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు లాంటి కళా పోషకుల ఆదరాభిమా నాలను సంపాదించు కొన్నది. ఎందరో ఉత్తమ భాగవత కళాకారులకు సింహతలాటాలను, ఘంటా కంకణాలను,కలియుగ సత్యభామ, పండిత సత్యభామ, అభినయ సత్యభామ, గాన కోకిల, వసంత గాన కోకిల వంటి బిరుదులను అందించారు.

కథ: కథ పాతది-శైలి ప్రత్యేకం. తూర్పు భాగవత ప్రదర్శనల్లోని కథపాతదే. భాగవతం అంటే క్రిష్ణుని కథలను గానం చేయడమే! ఈ తూర్పు భాగవతంలోని కథావస్తువు క్రిష్ణుడు, సత్యభామల మధ్య ఏర్పడిన ప్రణయ కలహమే. దీని నే పారిజాతాపహరణమని, భామా కలాపమని కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తారు. మొదట్లో సిద్ధేంద్ర యోగి భాగవత సంబంధమైన భామాకలాపాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.కానీ కూచిపూడి వీథి భాగవతులు అధిక ప్రచారంలోకి తీసు కొచ్చారు. కాగా సిద్ధేంద్రుడు రాసిన పారిజాతాపహరణానికి, తూర్పు ప్రాంతంవారు ప్రదర్శించే భాగవతానికి చాలా తేడా ఉంది. కూచిపూడి భామాకలాపంలో కనిపించే దరువులు తూర్పు భాగవతాల్లో తక్కువగా ఉంటాయి. తూర్పుభాగవతoలో కథా వస్తువు ఒక ముచ్చటైన సందర్భం మాత్రమే! తన మందిరం నుంచి అలిగి వెళ్ళి పోయిన క్రిష్ణుని, సత్యభామ రాయబారం పంపించి మళ్ళీ తన ఇంటికి రప్పించుకొన్న సందర్భమే కథావస్తువు. కథ చిన్నదే అయినా, అష్టవిధ నాయికల వర్ణన, అవస్థలూ, శృoగారంతో నిండి పెద్ద ప్రబంధమయింది. ఒకప్పుడు తూర్పు భాగవతాన్ని వరుసగా తొమ్మిది రోజులు ప్రదర్శించేవారు. ఆ తర్వాత మూడు రాత్రులకు కుదించారు. ప్రస్తుతం ఒక్క రాత్రికే పరిమితమయింది.

తూర్పు భాగవతంలోని కథని మొదట రూపొందించిoది విజయనగరం ప్రాంతానికి చెందిన వంకాయల బలరామ భుక్త. ఇందులోని కథ కూచిపూడి భాగవతం కథా ఒకటే అయినా పాటలకు సంబంధించిన బాణీ, దరువులు, నడిపే విధానం, మృదంగ వాయిద్య రీతుల్లోనూ వారి బాణీకి, తూర్పు భాగవత బాణీకీ చాలా తేడా ఉంది. బలరామ భుక్త తరువాత ఈ జిల్లాకు చెందిన నరసింగబల్లి వారు, కేశవపురి వారు, బొబ్బిలి వారు, దువ్వవారు, నెల్లిమర్ల వారు వంటి ఎందరో ప్రసిద్ధ నాట్య శాస్త్రవేత్తలు, ఈ తూర్పు భాగవత బాణీకి కావాల్సిన కలాప రచన లను చేశారు. అయితే ఈనాటికీ వంకాయల బలరామభుక్త రచనే ప్రచారంలో ఉందని కళాకారులు చెపుతారు.తూర్పు భాగవత ప్రదర్శనలో దరువులు, ద్విపదలు, కంద పద్యాలు, అర్ధచంద్రికలు, ఏలపదాలు తదితర దేశీసంగీత రచనలు ఉపయోగిస్తుంటారు. దరువులు ప్రాముఖ్యం వహిస్తాయి. భరతుడు నాట్యశాస్త్రంలో ఉదహ రించిన ప్రాచీన ధవాగానం అనే విధానాన్ని ఈ నాటికీ తూర్పు భాగవతులు ప్రదర్శిస్తున్నారు. రాగాలూ, తాళాలూ, నేటి కర్ణాటక సాంప్రదాయానికి చెందిన వైనా, రాగ సంచారం, తాళ ప్రసారం మొదలైన విధానాలు ప్రాచీన సంప్రదాయ పద్ధతిని అనుసరించే ఉంటాయి.

మృదంగo: తూర్పు భాగవత ప్రదర్శనలో మృదంగమే కీలకమైన వాయిద్యం. ఇది కళాకారులను తాండవ విన్యాసాలను చేయిస్తుంది. ప్రేక్షకులను ఉత్తేజం, ఉద్వేగాలతో అలరిస్తుంది. మృదంగ కళాకారులు తమ వాయిద్యంలో సముద్ర ఘోషలను,ఉరుముల ధ్వనులను, నగారాల భేరీనాదాన్ని వినిపిస్తారు. ఆ దరువులను బట్టే నృత్యంకూడా అంత ఉద్వేగంగా ఉంటుంది. వారి మృదంగ వాయిద్యంలో ఎంత గంభీరమైన నాదాలుంటాయో, అంతటి సున్నితమైన, మధుర మైన కోకిల స్వరాలూ, చిలుక పలుకులూ వంటి వాటిని కూడా అలవోకగా పలికిస్తూ ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచే స్తారు. ఇతర కళారూపాల్లో వాయిద్యకారులు కూర్చుని మృదంగం వాయిస్తారు. కానీ, తూర్పు భాగవతం ప్రదర్శనలో రెండు మృదంగాల్ని ఒకే కళాకారుడు ముందు వెనుక నడుముకు కట్టుకొని,ప్రదర్శన జరిగినంత సేపూ నిలబడి వాయిం చడo కష్టసాధ్యమైనది. దీనిని సంపూర్ణ ద్విపద రీతి అంటారు. తూర్పుభాగవతం కోసమే బొబ్బిలి ఆస్థానంలో నందిభరతం అనే మృదంగ జతుల గ్రంథాన్ని రూపొందించారు. ఒకే తాళంలో, సప్త తాళాలు ఇమిడి ఉండే రీతిలో, శబ్దాలను కూర్చి పలికించడం కళాకారుల ప్రతిభను వెల్లడిస్తోంది. ఈ విశిష్ట వాయిద్యంలో పాతతరం విద్వాంసులు బుగత రామయ్య, ఆయన కుమారుడు గోపన్న. ఆ తరం తరువాత కింతాడ అప్పన్న, ముట్నూరి సంగమేశ్వర శాస్త్రి, ధూపం సూర్యలింగం, గోవిందరావు వoటి వారు ప్రసిద్ధి పొందారు. అన్నివర్గాల కళాకారులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగే అమ్మవారి జాతర్లలో తూర్పు భాగవతాన్ని ప్రదర్శించడం ఇప్పటికీ సంప్రదాయంగా ఉంది. ఈ భాగవతాల్లో పాత్రలు ధరించే వారంద రూ పురుషులే. అయినా వందేళ్ల క్రితం, ఒకే ఒక స్త్రీ, భామ వేషం ధరించి, ఆనాటి ప్రజానీకాన్ని ఆశ్చర్యపరిచిందట. ఆమె తెర్లాం గ్రామానికి చెందిన కాలిగుంటి వెంకటస్వామి అనే భాగవత కళా కారుని కుమార్తె.

నిరాదరణ: శతాబ్దాల తరబడి ప్రజలను అలరించిన ఈ జానపద కళారూపం నేడు అంతరించే దశలో ఉంది. ఒకప్పుడు విజయనగరం, బొబ్బిలి, మాడుగుల, కశిoకోట, మందస, చోడవరం, చీకటికోట, ధారాకోట, సాలూరు, పార్వతీపురం తదితర సంస్థానాల జమీందారులు,ప్రజలు ఈ కళను ఎంతగానో ఆదరించి పోషించారు. విద్వాంసులైన భామ వేషధారులు, మార్దంగికులు కొద్దిమంది మాత్రమే జీవించి ఉన్నారు. కొత్త తరం వారెవరూ ఈ కళని నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి ఆసక్తి చూపడం లేదు. అక్కడక్కడ ఉన్న విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి. వేష-భూషణ అలంకారాలను భద్రపరచాల్సిన అవసరం ఉంది. డాక్యు మెంటరీలు తీయాలి.

సాంబమూర్తి: కోమటిపల్లికి చెందిన తూర్పు భాగవతార్‌బొంతలకోటి సాంబమూర్తి ఈ కళారూపాన్ని పదివేల సార్లకు పైగా ప్రదర్శించారు. ఆయన తూర్పు భాగవతంలో సత్యభామగా, గొల్లభామగా గుర్తింపు పొందారు. హరికథా కళాకారుడిగా కూడా ఆయన ప్రసిద్ధి. తన పన్నెండో ఏట తూర్పు భాగవతాన్ని మొదటిసారి ప్రదర్శించారు. అప్పటినుంచి 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. పిఠాపురం, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్‌, సికిందరాబాద్‌తదితర ప్రాంతాల్లో 54 ఏళ్ల పాటు తన ప్రతిభను చాటుకున్నారు. సౌత్‌సెంట్రల్‌జోన్‌కల్చరల్‌సెంటర్‌తూర్పు భాగవతంపై పరిశోధన చేసి ప్రచురించిన పుస్తకం కవర్‌పేజీపై సాంబమూర్తి ఫొటో ముద్రించారు.

– బెందాళం క్రిష్ణారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *